Hanuman Movie Review: రివ్యూ: హనుమాన్‌.. తేజ సజ్జా సూపర్‌హీరో మూవీ మెప్పించిందా?

Hanuman Movie Review; రివ్యూ: హను-మాన్‌; నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిషోర్‌, సత్య, గెటప్‌ శ్రీను తదితరులు; సంగీతం: అనుదీప్‌ దేవ్‌, గౌరా హరి, కృష్ణ సౌరభ్‌; సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర; ఎడిటింగ్‌: సాయిబాబు తలారి; నిర్మాత: నిరంజన్‌రెడ్డి; రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ; విడుదల: 12-01-2024

గ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘హను-మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన సూపర్‌ హీరో చిత్రమిది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా.. కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. మరి ఆ అంచనాల్ని ‘హను-మాన్‌’ అందుకున్నాడా? (Hanuman Movie Review) ఈ నయా సూపర్‌ హీరో సాహసాలు ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచిచ్చాయి?

కథేంటంటే: సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్‌ రాయ్‌)కు చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని బలమైన కోరిక. అందుకు అడ్డు వస్తున్నారని చిన్నతనంలోనే తల్లిదండ్రుల్నీ  మట్టు పెడతాడు. ఆ తర్వాత సూపర్‌ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తాడు. కానీ, అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దీంతో అసలు సిసలు సూపర్‌ పవర్స్‌ కనిపెట్టేందుకు వేట మొదలు పెడతాడు. కట్‌ చేస్తే.. కథ అంజనాద్రికి మారుతుంది. పాలెగాడు గజపతి (దీపక్‌ శెట్టి) అకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరది. (Hanuman Movie Review) అతనిని ఎదిరించిన వాళ్లను ఊరి మధ్యలోనే కుస్తీ పోటీల్లో మట్టుపెడుతుంటాడు. ఆ ఊరిలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు హనుమంతు (తేజ సజ్జా). తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి అక్క అంజమ్మే (వరలక్ష్మీ) అతనిని పెంచి పెద్ద చేస్తుంది.

హనుమంతుకు మీనాక్షి (అమృత అయ్యర్‌) అంటే చచ్చేంత ప్రేమ. ఆమె ఓరోజు గజపతికి ఎదురు తిరగడంతో అతను తన బందిపోటు ముఠాతో ఆమెపై దాడి చేయిస్తాడు. ఆ దాడి నుంచి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు తీవ్రంగా గాయపడతాడు. అతన్ని బందిపోటు ముఠా నీళ్లలో పడేయగా.. దాంట్లో అతనికి ఆంజనేయస్వామి రక్త బిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది. అది తన చేతికొచ్చిన తర్వాత నుంచి హనుమంతు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. (Hanuman Movie Review)  తను ఆ మణి ద్వారా ఆంజనేయుడి శక్తులు పొంది హనుమ్యాన్‌గా మారతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ శక్తులతో అతను చేసిన సాహసాలేంటి? హనుమంతు దగ్గరున్న రుధిరమణిని చేజిక్కించుకునేందుకు మైఖేల్‌ ఏం చేశాడు? అతని నుంచి అంజనాద్రికి ఏర్పడ్డ ముప్పును హనుమంతు ఎలా తొలగించాడు? ఈ క్రమంలో అతనికి విభీషణుడు (సముద్రఖని) ఎలాంటి సాయం అందించాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా సాగిందంటే: ఓ సామాన్యుడికి అద్వితీయమైన శక్తులు వచ్చి సూపర్‌ హీరో అవడం.. వాటిని దక్కించుకునేందుకు ఓ విలన్‌ రకరకాల ప్రయత్నాలు చేయడం.. ఈ క్రమంలో అతని వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడటం.. ఆ ముప్పు నుంచి హీరో కాపాడటం.. ఇలా సూపర్‌ హీరో చిత్రాలన్నీ ఇంచుమించు ఇదే కోవలో సాగుతాయి. ‘హను-మాన్‌’ కథ దాదాపుగా ఇదే పంథాలో సాగుతుంది. అయితే దీన్ని మన ఇతిహాసాలతో ముడిపెట్టి.. నేటివిటీ మిస్‌ కాకుండా ఆసక్తికరంగా తెరపై చూపించిన తీరు అందర్నీ అలరిస్తుంది. (Hanuman Movie Review) ఈ సినిమా టైటిల్‌ కార్డ్స్‌ నుంచే ప్రేక్షకులకు కథను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. కథలో కీలకమైన రుధిరమణి కథను అక్కడ వివరించి.. ఆ వెంటనే విలన్‌ చిన్ననాటి ఎపిసోడ్‌తో సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించాడు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో మైఖేల్‌ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో తనకు అడ్డుగా నిలుస్తున్నారని తల్లిదండ్రుల్ని మట్టుబెట్టడం.. మిస్టరీ మ్యాన్‌ అవతారంలో బ్యాంకు దొంగతానికి వచ్చిన ఓ రౌడీ ముఠాను చితక్కొట్టడం.. అన్నీ ఆకట్టుకునేలాగే ఉంటాయి. ఇక అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది.

కానీ, ఆ తర్వాత నుంచి కథ కాస్త నెమ్మదిస్తుంది. హీరో పరిచయ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. మీనాక్షితో అతని ప్రేమకథ పెద్దగా ఫీల్‌ ఉండదు. ఊరి పాలెగాడు గజేంద్రకు ఎదురు తిరగడం.. అతను మీనాక్షిని చంపేందుకు తన బందిపోటు ముఠాను రంగంలో దించడంతో కథ వేగం పుంజుకుంటుంది. (Hanuman Movie Review)  ఇక హీరో ఆ ముఠా చేతిలో చావు దెబ్బలు తిని నదిలో పడటం.. అక్కడ అతనికి రుధిరమణి దొరకడం కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. ఇక విరామానికి ముందు పాలెగాడు గజేంద్రతో అతను కుస్తీ పోటీలో పాల్గొనే ఎపిసోడ్‌ భలే కిక్‌ ఇస్తుంది. అదే సమయంలో మైఖేల్‌ను అంజనాద్రిలోకి దింపి ద్వితీయార్ధంపై మరింత ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశాడు.

రుధిరమణిని సంపాదించడం కోసం మైఖేల్‌ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో అతని ద్వారా అంజనాద్రికి ముప్పు ఏర్పడటం.. ఆ ముప్పు నుంచి ఊరిని.. ఊరి ప్రజల్ని కాపాడేందుకు హనుమంతు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్ధం సాగుతుంది. (Hanuman Movie Review)  మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు అక్కడ వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ హైలైట్‌. ఇక క్లైమాక్స్‌ చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. హిమాలయాల్లోని హనుమంతుడు లోక కల్యాణార్థం తిరిగి వచ్చే సన్నివేశాలు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అంటూ ఓ ఆసక్తికర ప్రశ్నతో రెండో భాగానికి లీడ్‌ ఇస్తూ సినిమాని ముగించిన తీరు బాగుంది. 

ఎవరెలా చేశారంటే: హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జా (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. ఇక సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. ఇటు యాక్షన్‌లోనూ.. అటు భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ తేజ తన పాత్ర పరిధి దాటకుండా చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ (Amritha Aiyer) తెరపై అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (varalaxmi sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ (Vinay Rai) స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర ఈ కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్‌ మాస్టర్‌ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి.

సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి.. ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) తీర్చిదిద్దుకున్న తీరు మెప్పిస్తుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం.. కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం.. ప్రేక్షకులకు అక్కడక్కడా బోర్‌ కొట్టించొచ్చు. ప్రశాంత్‌ తనకిచ్చిన పరిమిత బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించాడు. పిల్లలు, పెద్దలు మెచ్చేలా సినిమాని చక్కగా ముస్తాబు చేశాడు. (Hanuman Movie Review in telugu) ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే.. ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • తేజ సజ్జా నటన
  • గ్రాఫిక్స్‌ హంగులు, నేపథ్య సంగీతం
  • బలహీనతలు
  •  అక్కడక్కడా నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు
  • చివరిగా: జై హనుమాన్‌.. జై శ్రీరామ్‌..(Hanuman Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 

Reference

Denial of responsibility! Samachar Central is an automatic aggregator of Global media. In each content, the hyperlink to the primary source is specified. All trademarks belong to their rightful owners, and all materials to their authors. For any complaint, please reach us at – [email protected]. We will take necessary action within 24 hours.
DMCA compliant image

Leave a Comment